విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లాఠీ. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు. విశాల్ ఈవెంట్ లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్ పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు.
హీరో విశాల్ మాట్లాడుతూ.. “విజయేంద్రప్రసాద్ గారిని ఎప్పటి నుండో కలవాలని నా కోరిక. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డిసెంబర్ 22న లాఠీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దర్శకుడు ఏ వినోద్ కుమార్ గురించి సినిమా విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్ నే చెబుతుంది. సినిమా నిర్మాతలు రమణ, నంద నా స్నేహితులు. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. యువన్ శంకర్ రాజా నాకు చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చారు. లాఠీ కి బ్రిలియంట్ స్కోర్ చేసారు. డాక్టర్ పవన్ సినిమాని తెలుగులో పంపిణీ చేస్తున్నారు. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ అమేజింగ్ వర్క్ ఇచ్చారు. హీరోయిన్ సునయనతో పాటు ఈ సినిమాలోపని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాని కూడా ఎంత మంది చూస్తారో ఒకొక్క టికెట్ కి ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను. ఈ ఈవెంట్ విచ్చేసి మాకు బెస్ట్ విషెస్ అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు.
రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “విశాల్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను (నవ్వుతూ). విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది (నవ్వుతూ). మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో, మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. కార్తికేయ 2 ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది. లాఠీ కూడా అద్భుతమైన విజయం అందుకుంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ సినిమా చూసి పెద్ద హిట్ చేయండి” అని కోరుకున్నారు.