అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్. సోనాల్ చౌహాన్ కథానాయిక. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో సోనాల్ చౌహాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
ఈ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించడానికి ఎలాంటి కసరత్తు చేశారు?
ఇందులో శారీరకంగా, మానసికంగా చాలా సవాల్ తో కూడుకున్న పాత్ర చేశాను. ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. యాక్షన్ తో పాటు ఎంఎంఎ శిక్షణ పొందాను. అయితే శిక్షణలో రెండో రోజే నా కాలివేలు ఫ్రాక్చర్ అయ్యింది. చిన్న గాయమే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్ రే తీయమని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ శిక్షణలోకి వచ్చాను. అలాగే ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాను.
నాగార్జున గారితో పని చేయడం ఎలా అనిపించింది?
నాగార్జున గారితో పని చేయడం ఒక డ్రీమ్. ఆ కల ఈ సినిమాతో తీరింది. ఆయన్ని కలసినప్పుడు కాస్త నెర్వస్ గా ఫీలయ్యా. అయితే పది నిమిషాల మాట్లాడిన తర్వాత నా భయం అంతా పోయింది. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. నాగార్జున గారు కింగ్ అఫ్ రోమాన్స్. వేగం పాటలో మా కెమిస్ట్రీ చూసేవుంటారు. అయితే ది ఘోస్ట్ యాక్షన్ థ్రిల్లర్. నాగార్జున గారితో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని వుంది. (నవ్వుతూ).
దర్శకుడు ప్రవీణ్ సత్తారు తో పని చేయడం ఎలా అనిపించింది?
ప్రవీణ్ సత్తారు చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు . ఆయన చాలా నీట్ గా హోమ్ వర్క్ చేసుకుంటారు. దీంతో సెట్స్ లో ఎలాంటి కన్ఫ్యుజన్ వుండదు. మిగతా నటీనటులు పని ఈజీ అవుతుంది. ఆయన చాలా క్లారిటీ వున్న దర్శకుడు.
ఈ చిత్రంలో మీరు ఎన్ని యాక్షన్ బ్లాక్స్ లో కనిపిస్తారు?
నాకు ఇందులో రెండు మెయిన్ యాక్షన్ బ్లాక్స్ వున్నాయి.
జయాపజయాలని ఎలా తీసుకుంటారు?
నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. చాలా సాంప్రదాయ రాజ్ పుత్ కుటుంబం నుండి వచ్చాను. యాక్టింగ్ మాట పక్కన పెడితే మాకు ఇంటి నుండి బయటికి రావడమే గొప్ప. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చాను. ప్రతిది ఇక్కడే నేర్చుకున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు వుంటాయి. వాటిని ఎలా తీసుకోవాలో కూడా ఇండస్ట్రీనే నేర్పింది.