Friday - April 19, 2024
Friday - April 19, 2024
For advertising email us: [email protected]

‘Of the cinema, by the cinema, for the cinema’ is our motto.
We are the all-in-one destination for cine maniacs.

సమంత 45 నిమిషాలు కథవిని యశోద ఓకే చేశారు: నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

Written by:

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.

సమంత నటించిన తొలి పాన్ ఇండియా సినిమా యశోద ఎలా మొదలైంది?

సమ్మోహనం తర్వాత నేను నిర్మించిన డైరెక్ట్ సినిమా యశోద. దీనికి మా అంకుల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు నాతో ఉన్నాయని అనుకుంటున్నాను. ఆయన సెప్టెంబర్ 25, 2020లో పరమపదించారు. అప్పుడు నేను చెన్నై వెళ్ళాను. ఎస్పీ చరణ్‌కు మద్దతుగా కొన్ని రోజులు ఉన్నాను. అప్పుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత సెంథిల్ చెప్పడంతో హరి, హరీష్ దగ్గర కథ విన్నాను. కొత్త పాయింట్ కావడంతో ఎగ్జైట్ అయ్యాను. అప్పుడు కోయంబత్తూరుకు చెందిన వాళ్ళుఎవరో నిర్మాత. నా సలహా అడిగితే రెండు మూడు విషయాలు చెప్పాను.

స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత సమంత దగ్గరకు వెళ్ళారా?
అవును. యశోదను అన్ని భాషల్లో చేయడానికి తగ్గ కథానాయిక ఎవరని చూస్తే సమంత గారు అయితే బావుంటుందని అనిపించింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తో ఆవిడకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సమంత చేస్తారా? లేదా? అసలు కథ వింటారా? అంటే ఆమె మేనేజర్, నిర్మాత మహేంద్ర తప్పకుండా వింటారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ 8న సమంత కథ విన్నారు. వెంటనే చేస్తానని చెప్పారు. అన్ని భాషల్లో చేద్దామని చెబితే ఆవిడ ఓకే అన్నారు. సమంత తర్వాత మరో కీలక పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ తీసుకున్నాం. కథ డిమాండ్ చేయడంతో ఒక్కో పాత్రకు ఒక్కొక్కరిని ఎంపిక చేసుకున్నాం.

సమంతతో జర్నీ, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
ఆమె స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి యశోదతో సమంత ట్రావెల్ చేశారు. శాకుంతలం పూర్తి కావడంతో ఫోకస్ మొత్తం సినిమాపై పెట్టారు. షూటింగ్ టైమ్‌లో బాధ్యతగా ప్రతి విషయాన్ని చూసుకున్నారు.

సమంత ఆరోగ్యం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. విడుదల సమయంలో ఆవిడ లేని లోటు…
సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పించవచ్చని అన్నాను. తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసని ఆవిడే చెప్పారు. హిందీలో చిన్మయి చెప్పారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి మూడు నాలుగు రోజుల ముందు మాకు తెలిసింది.

యశోద కథ ఏంటి? సరోగసీని వ్యాపారంగా మార్చేశారని చెబుతున్నారా?
కాదండి. సరోగసీ నేపథ్యంలో జరుగుతున్న క్రైమ్ చూపిస్తున్నాం. క్రైమ్స్ రకరకాలు.

గతంలో మీరు ప్రయోగాత్మక సినిమాలు చేశారు? ఆ సినిమాల్లో హీరోలు ఉన్నారు. ఫస్ట్ టైమ్ మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. ఇది ప్రయోగమా?
ప్రయోగం కాదు. ఎక్స్‌పరిమెంట్ అనుకుని చేయలేదు. ఎగ్జైట్‌మెంట్‌తో యశోద చేశా. “నువ్వు ఆదిత్య 369 చెయ్యవయ్యా. నిన్ను 30 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటారు” అని బాలు అంకుల్ చెప్పారు. టైమ్ ట్రావెల్ విని ఎగ్జైట్ అయ్యా. ఇప్పుడు కూడా కథ విని అలాగే చేశా.

లేడీ ఓరియెంటెడ్ సినిమా, పాన్ ఇండియా లెవల్ అంటే రిస్క్ అనిపించలేదా?
సినిమా బావుంటే ప్రేక్షకులు చూస్తారు. కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ టైమ్ విడుదలకు ముందు నాకు ఈ సినిమా కంఫర్ట్ లెవల్ లోకి వచ్చింది. రిలీజ్ తర్వాత కూడా కంఫర్టబుల్ గా ఉంటాను.

యశోద కోసం భారీ సెట్స్ వేశారు. ఎందుకు?
ఇప్పుడు ఆస్పత్రులు ఫైవ్ స్టార్ రేంజ్‌లో ఉంటున్నాయి. అటువంటి ఆసుపత్రిలో షూటింగ్ చేయాలి. పైగా, మేం కరోనా మూడో వేవ్ సమయంలో షూటింగ్ చేశాం. ఆసుపత్రికి వెళితే అక్కడ ఇబ్బంది ఉండొచ్చు. అందుకని, సెట్స్ వేశాం. 55 రోజులు ఆ సెట్స్ లో షూటింగ్ చేశాం. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్భుతమైన సెట్స్ వేశారు.

సినిమాలో డైలాగులు ఎలా ఉండబోతున్నాయి?
దర్శకులు హరి, హరీష్ తమిళులు. ఇద్దరికీ తెలుగు రాదు. అందుకని, తెలుగులో మాటలు రాయడానికి సీనియర్ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి అయితే బావుంటుందని వాళ్ళకు పరిచయం చేశా. నాకు పదిహేనేళ్ళుగా చిన్నారాయణ పరిచయం. సినిమాలపై మంచి పుస్తకాలు రాశాడు . కథానుగుణంగా ఇద్దరూ చక్కటి మాటలు రాశారు. దర్శకులకు వాళ్ళ వర్క్ బాగా నచ్చింది.

డిస్ట్రిబ్యూషన్ కూడా మీరే చేస్తున్నారని విన్నాం. నిజమేనా?
అవునండి. ఏపీ, తెలంగాణలో సునీల్ గారు సపోర్ట్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో యూఎఫ్ఓ, కర్ణాటకలో డిస్నీ వాళ్ళ ద్వారా చేస్తున్నాం. తమిళ్, మలయాళంలో సూర్య గారి కంపెనీ ద్వారా చేస్తున్నాం. సినిమా మీద నమ్మకం ఉంది.

ఫిల్మ్ మేకింగ్‌లో నిర్మాతల ప్రమేయం తగ్గిందని, నిర్మాతలను ఫైనాన్షియర్లుగా ట్రీట్ చేస్తున్నారనే మాటలు వింటున్నాం. ఈ పరిస్థితులపై మీరేమంటారు?
ఎప్పటికప్పుడు వాతావరణం మారుతుంటుంది… దాన్ని లేటెస్ట్ అంటాం. ఐదారు నెలలుగా మళ్ళీ భయం మొదలైంది. ఇప్పుడు నిర్మాత భయపడాలి. ఎందుకంటే… కరోనా తర్వాత ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. ఓటీటీల్లో సబ్ టైటిల్స్ ఉంటున్నాయి. వరల్డ్ సినిమా చూస్తున్నారు. అందుకని, ఏమాత్రం రొటీన్‌కి దగ్గరగా ఉన్నా నిర్ధాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. అది నెక్స్ట్ షో కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. మంచి చెడులు ఉండటం లేదు. ప్రేక్షకులు తోక్కేస్తున్నారు. కాంబినేషన్స్ మీద కాకుండా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలు కాన్సంట్రేషన్ చేస్తున్నారు.

ఇప్పుడు నిర్మాతల వారసులు వస్తున్నారు. మీ వారసులు?
మా అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడు సినిమాల్లోకి రాడు. కానీ, సినిమా అంటే మహా పిచ్చి. వంద డాలర్లు పెట్టి బ్లాక్‌లో సినిమా చూస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెల్లవారు జామున మూడు, నాలుగు వేలు పెట్టి టికెట్ కొని బెనిఫిట్ షోస్ చూసేవాడు. టికెట్స్ కొనడానికి ఎంతైనా ఖర్చు పెట్టు గానీ సినిమాల్లోకి రావద్దని చెప్పాను. నేను పరిశ్రమలో ఎత్తు పల్లాలు చూసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అది. పరిశ్రమలో మహానుభావులను చూశా.

మరి, మీ అమ్మాయి విద్య?
మా అమ్మాయి విద్య డిజిటల్‌లో వర్క్ చేస్తోంది. ఇప్పుడు తనది స్పాటిఫైలో ఉద్యోగం. సమ్మోహనం, జెంటిల్ మన్ సినిమాలకు హెల్ప్ చేసింది. ఈ సినిమాకూ అంతే! వద్దని చెప్పింది మా అబ్బాయికి మాత్రమే. అమ్మాయితో ‘నీ ఇష్టం’ అని చెప్పాను. ‘నాకు ఎంత వరకు చేయాలో తెలుసు నాన్నా’ అంది. ఉన్నంతలో మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. మంచి సినిమాలు తీసి రిటైర్ అవ్వాలని ఉంది.

కాంబినేషన్ అని కాదు గానీ… మీరు ఇంతకు ముందు బాలకృష్ణ గారితో వరుస సినిమాలు చేశారు. మళ్ళీ ప్లానింగ్ ఉందా?
బాలకృష్ణతో ఎప్పుడూ నాకు స్వీట్ రిలేషన్షిప్ ఉంది. ఈ మధ్య కలిశా. యశోద ఏ తరహా సినిమా అని అడిగారు. కొత్త కాన్సెప్ట్ అని చెప్పా. మీరు చేస్తే బ్రహ్మాండం అన్నారు. ఇప్పుడు కూడా సినిమా గురించి డిస్కషన్స్ వస్తాయి. ఆయన ఇమేజ్, నా అభిరుచికి తగ్గ కథ ఎవరైనా తీసుకొస్తే చేయాలని నాకు కూడా ఉంది.

Social Share

Related Posts

Galleries