అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్. ఇంటర్పోల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో కింగ్ నాగార్జున విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు
ది ఘోస్ట్ లో తమహగనే వెపన్ ప్రమోషన్స్ లో ఆకట్టుకుంది. దీని వెనుక కథ వుందా?
తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ వుంది. ఈ సినిమాలో వుండదు కానీ తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది నచ్చి దాన్ని గ్లింప్స్ గా వదిలాం. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ బ్యాక్ స్టొరీ కూడా చూపిస్తాం.
ది ఘోస్ట్ పై చాలా ఇష్టం చూపిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు?
ది ఘోస్ట్ కథలో చక్కని ఫ్యామిలీ లైన్ వుంది. సిస్టర్, బ్రదర్ బాండింగ్ బావుంటుంది. తన సిస్టర్, ఫ్యామిలీని కాపాడటానికి హీరో చేసే పోరాటం చాలా నచ్చింది. నేను ఎప్పుడూ కొత్తదనాన్ని ఇష్టపడతాను. ప్రవీణ్ సత్తారు ఈ కథని చాలా కొత్తగా ప్రజంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్రదర్-సిస్టర్ బాండ్ ని అద్భుతంగా చూపించారు. సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యాను. ప్రవీణ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడు. చాలా ఇంప్రస్ అయ్యాను. ఒక యాక్షన్ మూవీ లో ఎమోషన్ ఈ స్థాయిలో పండటం నాకే షాక్ అనిపించింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటికి వచ్చినపుడు యాక్షన్ విషయంలో ఒక షాక్ ఫీలౌతారు. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఇందులో క్లైమాక్స్ చర్చ్ ఫైట్ ఒక మెయిన్ హైలెట్.
ది ఘోస్ట్ కథని ఎంచుకోవడానికి కారణం?
నేను చాలా యాక్షన్ మూవీస్ చేశాను. కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని వుండేది. గరుడవేగలో యాక్షన్ చాలా నచ్చింది. ప్రవీణ్ ని పిలిచి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పాను. అప్పుడు నన్ను మైండ్ లో పెట్టుకొని ది ఘోస్ట్ కథని తయారు చేసారు. ఈ సినిమాలో యాక్షన్ కోసం మూడు వారాల శిక్షణ కూడా తీసుకున్నాం.
మీరు బాలీవుడ్ లో చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి నటులు ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. బౌండరీలు చేరిగిపోయాయని అనుకోవచ్చా?
ఇప్పుడు బౌండరీలు లేవు. యుఎస్ లో ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ వచ్చిన రెస్పాన్స్ వీడియో చూస్తే దేశంలోనే కాదు ప్రపంచ సరిహద్దులు కూడా చెరిగిపోయాయని అనిపించింది. బ్రహ్మాస్త్రలో నేను చేసిన పాత్రకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు గురించి?
ప్రవీణ్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు. తన హోమ్ వర్క్ కి చాలా టైం తీసుకుంటాడు. అయితే అతను చేసే ప్రీ ప్రొడక్షన్ చక్కగా వుంటుంది. ఆయన చేసిన ప్రీ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా 66 రోజుల్లోనే పూర్తయింది.
కొత్తగా చేయబోయే సినిమాలు?
రెండు మూడు కథలు చర్చలో వున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్లో వుంటాయి. అలాగే వెబ్ సిరిస్ చర్చలు కూడా నడుస్తున్నాయి.