నాగశౌర్య కథానాయకుడిగా, అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో దర్శకుడు అనీష్ విలేఖరుల సమావేశంలో కృష్ణ వ్రింద విహారి విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమా కోసం నాగశౌర్యని ఎప్పుడు కలిశారు?
నాగశౌర్య గారికి 2020లో ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన హోమ్ బ్యానర్ లోనే ఈ కథ చేయాలని నిర్ణయించారు.
నాగశౌర్య స్వతహగా రచయిత కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు?
చాలా బలమైన కథ ఇది. నిజానికి హీరోలకు కథని నేను నెరేట్ చేయను. నెరేషన్ లో నేను కొంచెం వీక్. నా సహాయ దర్శకుడితో చెప్పిస్తుంటాను. కాని తొలిసారి ఈ కథని శౌర్యగారికి నేనే చెప్పాను. కథలో వున్న బలం అలాంటిది. నేను చెప్పినా ఓకే అవుతుందనే నమ్మకంతో చెప్పాను. నేను చెప్పినప్పుడే ఆయనకు చాలా నచ్చేసింది.
కృష్ణ వ్రింద విహారి వుండే యూనిక్ పాయింట్ ఏంటి?
ఇప్పటివరకూ ఇందులో వున్న యూనిక్ పాయింట్ ని ఇంకా రివిల్ చేయలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కథపై ఒక అవగాహన ఇస్తాం. అయితే ఈ కథకి మూలం చెప్తాను. నాకు బాగా కావాల్సిన సన్నిహితుడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఫ్రేమ్ చేసుకున్న కథ ఇది. ఈ పాయింట్ చాలా ఎంటర్ టైనర్ గా వుంటుంది. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు.
బ్రాహ్మణ పాత్రలో ఇటివలే ఒక హీరో చేశారు కదా.. చాలా తక్కువ కాలంలోనే మళ్ళీ మీరు అదే పాత్రతో వస్తున్నారు.. ఫ్రెష్నెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
మీరు చెబుతున్న అంటే సుందరానికీ’ సినిమా నేను చూశాను. నాని గారికి ఒక ప్రత్యేక శైలి వుంది. ఆయనే కాదు.. అల్లు అర్జున్ గారు డీజే, ఎన్టీఆర్ గారు అదుర్స్, కమల్ హాసన్ గారు మైకేల్ మదన్ కామరాజు ఇలా ఎవరి స్టయిల్ వారికి వుంటుంది. నాగశౌర్య గారికి కూడా ఒక యూనిక్ స్టయిల్ వుంది. ఆయనలో ఒకరకమైన అమాయకత్వం, క్యూట్ నెస్, కొంటెతనం, అల్లరి వుంటుంది. కృష్ణ పాత్రకు నాగశౌర్య యాప్ట్. ఇందులో నేను ఎంచుకున్న నేపధ్యం కూడా ఆచార్యులు. శౌర్యగారిని చూడగానే ఆ ఛార్మ్ కనిపించింది. అందుకే కథ పూర్తయిన తర్వాత మొదట శౌర్యగారినే కలిశాను.
కామెడీని డీల్ చేయడం కష్టం.. కానీ మీ మొదటి సినిమా అలా ఎలా ని చాలా వినోదంగా తీశారు.. ఇందులో వినోదం ఎలా వుంటుంది?
అలా ఎలా ని చాలా స్వేఛ్చగా తీశాను. ప్రేక్షకులకు చాలా నచ్చింది. కృష్ణ వ్రింద విహారిలో కూడా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ వుంటుంది. నాగశౌర్యతో పాటు బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు మంచి వినోదాన్ని పంచుతాయి. సినిమాని ప్రేమించి తీస్తే ఎలా వుంటుందో ఈ సినిమాతో చూస్తారు.
కంటెంట్ బావుంటేనే ప్రేక్షకులు థియేటర్ కి వస్తున్నారు.. మీ కంటెంట్ పట్ల ఎంత నమ్మకంగా వున్నారు? రిలీజ్ టెన్షన్ ఉందా?
కంటెంట్ పట్ల మాకు పూర్తి నమ్మకం వుంది. బయటవాళ్ళు కూడా చూసి చాలా పాజిటివ్ గా స్పందించారు. నిన్ననే సెన్సార్ పూర్తయింది. సెన్సార్ నుండి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి.” చాలా కాలం తర్వాత మంచి ఫ్యామిలీ మూవీ చూశాం. సినిమా చుస్తున్నంత సేపు నవ్వుతూనే వున్నామని” చెప్పారు.